Advertisement

కోవిడ్-19 సంధర్భంగా ఈదుల్ అజ్హా పండుగ మార్గదర్శకాలు విడుదల చేసిన షరియా కౌన్సిల్

కోవిడ్-19 సంధర్భంగా ఈదుల్ అజ్హా పండుగ  మార్గదర్శకాలు ...

ఖుర్బానీకి ప్రత్యామ్నాయంలేదు...

ఈదుల్ అజ్హా పండుగ  మార్గదర్శకాలు విడుదల చేసిన షరియా కౌన్సిల్.


మరికొన్ని రోజుల్లో ఈదుల్ అజ్హా పండుగ రాబోతోంది. ఈ పర్వదినాన ఖుర్బానీ ఇవ్వడం ముఖ్యమైన ఆరాధన. కోవిడ్-19 వ్యాధి వేగంగా ప్రబలుతున్న దీని కట్టడికి ప్రభుత్వ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఖుర్బానీ గురించి ముస్లిముల్లో ఎన్నో సందేహాలు వెంటాడుతున్నాయి. 

జమాఅతె ఇస్లామీహింద్ నేతృత్వంలోని షరియా కౌన్సిల్ ఈ సందేహాలను నివృత్తి చేస్తూ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ సూచనలను ముస్లిములు గమనంలోకి తీసుకోవాలని కౌన్సిల్ ఉలమాలు కోరుతున్నారు. 

1. ఈదుల్ అజ్హా పండుగనాడు ఖుర్బానీ (పశువును బలివ్వడం) చేయడం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలామ్ సంప్రదాయం. ఇదే సంప్రదాయాన్ని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ (స) అనుసరించారు. తన సముదాయాన్ని కూడా ఖుర్బానీ ఇవ్వాలని తాకీదు చేశారు. ఇదేదో మొక్కుబడిగా చేసే ఆరాధన కాదు. ఖుర్బానీ రోజుల్లో ఖుర్బానీ ఇవ్వడం కంటే అల్లాహ్ కు ప్రియమైన ఆరాధన మరొకటి లేదు. కావున ఈదుల్ అజ్హా పర్వదినాన ఖుర్బానీ ఇవ్వడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఖుర్బానీ ఇవ్వడం తప్పనిసరి. ఖుర్బానీకి పరిహారంగా ఆ డబ్బును నిరుపేదలకు దానం చేయడం సముచితం, సమంజసం కాదు. 

2. ఖుర్బానీ ఇవ్వగల ఆర్థిక స్థోమతగల ముస్లిములు తాముండే ప్రాంతంలో ఖుర్బానీ ఇచ్చేందుకు వీలుకుదరకపోతే వేరే ప్రాంతాల్లో ఖుర్బానీ ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా చేయడమూ వీలుకాని పక్షంలో ఖుర్బానీ రోజులు ముగిసాక ఖుర్బానీ జంతువు ఖరీదు లెక్కకట్టి ఆ డబ్బును నిరుపేదలకు దానం చేయాలి. 

3. ప్రభుత్వ చట్టాలను గౌరవిస్తూ షరీయత్ నియమనిబంధనల్ని పాటించాలి. ప్రభుత్వం నిషేధించిన పశువులను ఖుర్బానీ కోసం వధించకూడదు. ఖుర్బానీ చేసే ప్రదేశాల్లో పారిశుద్ధ్యాన్ని పాటించండి. ప్రజలు తిరిగే మార్గాల్లో. వీధుల్లో ఖుర్బానీ చేయకండి. ఖుర్బానీ పశువు వ్యర్థాలను మట్టిలో పూడ్చిపెట్టండి. 

4. ఈదుల్ అజ్హాకంటే కొన్ని రోజుల ముందుగానే ఒక కమిటీని నియమించుకోండి. పరిస్థితుల్ని సమీక్షించి ఖుర్బానీ పండుగ శాంతియుతంగా జరుపుకునేలా చేయడం ఆ కమిటీ బాధ్యత వహించాలి. స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపి పండుగ శాంతియుతంగా జరిగేలా చూడాలి.

5. ఈదుల్ అజ్హా నమాజును భౌతికదూరం పాటిస్తూ నిర్వహించాలి. కోవిడ్-19 ప్రభావిత ప్రాంతాల వారు ఇళ్లల్లోనే నమాజులు చేసుకోవాలి. ఈదుల్ ఫిత్ర్ నమాజును ఇళ్లల్లో చేసుకున్నట్లుగానే. 

6. ఈదుల్ అజ్హా పండుగ, ఖుర్బానీ ఆరాధన ముస్లిములకు మహోన్నతమైనవి కావున కేంద్ర , రాష్ట్రప్రభుత్వాలు తగినన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా షరీయా కౌన్సిల్ విజ్ఞప్తి చేస్తోంది. అల్లరిమూకల నుంచి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతోంది. ముస్లిములు శాంతియుతంగా, సంయమనం పాటిస్తూ పండుగను జరుపుకోవాలని ఆశిస్తున్నాము.

అల్లాహ్ మనందరినీ తన ధర్మంపై నిలకడను ప్రసాదించుగాక (ఆమీన్)

అనువాదం : ముహమ్మద్ ముజాహిద్

Comments

Advertisement