Advertisement

జిహాద్” లక్ష్యం విచ్ఛిన్నమా? నిర్మాణమా?

 “జిహాద్” లక్ష్యం 

విచ్ఛిన్నమా?

 నిర్మాణమా?

 పూర్తి ఖురాన్ లో “జిహాద్” అనే పదం నాలుగు సార్లు కనపడుతుంది. ఆ నాలుగు సందర్భాల్లోనూ “తీవ్రమైన కృషి” “ప్రయత్నం” అణచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా చేసే “ధర్మపోరాటం” అన్న అర్థాల్లోనే తప్పా ఎక్కడా కూడా ఈ పదం “ఉగ్రవాదం” అన్న అర్థంలో వాడబడలేదు.



   ఆ నాలుగు వాక్యాలు:- 

 1. “అల్లాహ్ కంటే ఆయన ప్రవక్త కంటే ఆయన మార్గంలో పరిశ్రమించటం కంటే మీకు ఏదీ ప్రియం కాకూడదు” - 9:24 

2. “కనుక ప్రవక్తా! అవిశ్వాసుల మాట ఎంతమాత్రం నమ్మకు ఈ ఖురాను ద్వారా వారితో మహత్తరమైన పోరాటం (జిహాదన్ కబీరా) జరుపు” - 25:52 

3. “అల్లాహ్ మార్గంలో పరిశ్రమించండి. పరిశ్రమించవలసిన విధంగా. ఆయన మిమ్మల్ని తన సేవకై ఎన్నుకున్నాడు” - 22:78 

4. “విశ్వసించిన ప్రజలారా! మీరు గనుక నా మార్గంలో పోరాడటానికి, నా ప్రసన్నత పొందటానికి బయలుదేరినప్పుడు నాకూ మీకూ శత్రువులైన వారితో స్నేహం చెయ్యకండి” - 60:1 

     దైవ మార్గంలో పరిశ్రమించటాన్ని, ఖురాన్ ద్వారా సందేశం ఇవ్వటాన్ని, అణచివేతదారులకు వ్యతిరేకంగా పోరాడటానికి తప్ప ఎక్కడా అన్యాయంగా దౌర్జన్యం చెయ్యమని గానీ, ఉగ్రవాదం చేసి అమాయకులను హాని తలపెట్టమని గానీ ఎక్కడా చెప్పలేదు. ముఖ్యంగా చాలా మంది విమర్శిస్తున్నట్టు ముస్లిమేతరులను అన్యాయంగా చంపటం జిహాద్ కాదు. అలాంటి విమర్శలు చేసేవారిదంతా "గాసిప్ జ్ఞానమే" తప్ప "ఇస్లాం జ్ఞానం" కాదు.

   మీడియా కారణంగా బ్రెయిన్ వాష్ చేయబడ్డ వారిలో మటుకు “జిహాద్” అంటే “టెర్రరిజం” అన్న అపార్థమే బలంగా నాటుకుపోయి ఉంది. నిజానికి “జిహాద్” అన్న అరబీ భాషా పదానికి ధాతువు జ.హ.దా. అంటే దానర్థం- “శ్రమించటం (To struggle)” “కృషి చెయ్యటం (To strive)” అంతే. తప్పితే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అన్యాయంగా చంపటం అనో, తీవ్రవాదం చెయ్యటం అనో కాదు.


   ‘జిహాద్ శక్తి (Spirit of Jihad)’ నిర్మాణం కొరకే తప్ప.. విచ్చిన్నానికి కాదు! ఓ విద్యార్థి తన సామర్థ్యాలను పెంపొందించుకోవటం కోసం శ్రమించటం జిహాద్.. కఠిన సమయాల్లో నవ్వగలగటం, కష్టాల్లో సహనంగా ఉండగలటం జిహాద్.. హృదయంలో మెదిలే చెడులతో పోరాడటం జిహాద్.. వృద్ధ తలిదండ్రులను అప్యాయతతో చూసుకోవటం జిహాద్.. ప్రజలను నిజాయితీతో పాలించటం జిహాద్.. చెడు రూపుమాపి శాంతిస్థాపనకు కృషి చెయ్యటం జిహాద్.. జాతి జనుల కోసం తన సర్వన్ని త్యజించడం జిహాద్... 


 మరి కొందరు ఉగ్రవాదులు “జిహాద్” అని పలుకుతూనే “టెర్రరిజం” చెయ్యటం లేదా? అని ఎవరన్నా ప్రశ్నించవచ్చు. చెయ్యటం నిజమే కానీ.. దానిని “జిహాద్” పదం యొక్క “దుర్వినియోగం (Misuse)” అని చెప్పాలి. ఉదాహరణకు: “జై శ్రీరాం” అని పలకమని ఎందరో ముస్లిముల పై దాడులు జరిగిన వార్తలు చదివి ఉన్నాం. దానర్థం శ్రీరాముడు అలా తీవ్రవాదం చెయ్యమన్నాడని కాదు కదా? ఏ మతంలో అయినా మంచి వాళ్లే కాదు కొందరు చెడ్డవాళ్లు, ఉన్మాదులూ ఉంటారు. అలాంటి వారు తమ మతవిశ్వాసాలనో, ధార్మిక ధృక్పథాలనో “దుర్వినియోగం (Misuse)” చేసినంత మాత్రానా ఆయా మతాలను వేలెత్తి చూపటం.. ఆయా మత వర్గం వారందరినీ ఆ కొందరు ఉన్మాదులు చేసే తప్పుకు బాధ్యులుగా చెయ్యటం అవివేకం అనిపించుకుంటుంది. 

    కాబట్టి ప్రతీ మనిషీ తన జీవితంలో ప్రతీ క్షణం చెయ్యాల్సిన నిత్య ప్రక్రియ జిహాద్. దాని అసలు లక్ష్యం "నిర్మాణమే (Construction)" తప్ప "విచ్చిన్నం (Distriction)" ఎంతమాత్రం కాదు. 

    ముఖ్యంగా ఖురాన్ చెడును “మారణాయుధాలతో తొలగించమనటం లేదు” కానీ... “నీవు చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించు” (41:34) అని చెబుతుంది. 

 ప్రవక్త ముహమ్మద్ (స) చెయ్యమంటున్న ఉత్తమ ‘జిహాద్’ ఏమిటో ఒకసారి చదవండి. “ఏ వ్యక్తి అయితే దైవం కొరకు తన హృదయంలో మెదిలే చెడులతో పోరాడతాడో అతడే వాస్తవంగా జిహాద్ చేసిన వాడు” – సహీహ్, ఇబ్నె హిబ్బన్ 4862 

 “జీహాద్” కు వ్యతిరేకపదం “టెర్రరిజం!” “టెర్రరిజం (Terrorism)" అన్న పదాన్ని అరబ్బీలో "జిహాద్" అనరు "ఇర్హాబ్ (إرهاب) అంటారు. అంటే ప్రజలను భయభ్రాంతులకు గురిచెయ్యటం (Terrorize) అన్న మాట! అలాగే "టెర్రరిస్ట్ లేక ఉగ్రవాది (Terrorist)" అన్న పదాన్ని అరబ్బీలో "జిహాదీ" అనరు కానీ.. "ఇర్హాబి” (إرهابي) అంటారు. మీడియా తాలూకు గాసిప్ జ్ఞానం తప్ప ఇలాంటి విషయాలు అరబీ భాషా పరిజ్ఞానం లేనోల్లకు తెలియవు. కాబట్టి “జిహాద్” అన్న పదానికి అర్థం “ఉగ్రవాదం” కాదు కదా కనీసం సమాంతర పదం (Synonym) కూడా కాదు. “జీహాద్” అన్న పదానికి వ్యతిరేక పదం అరబ్బీలో “ఇర్హాబ్”! దీనిని బట్టి “జీహాద్” అన్నది హింసతో కూడిన ప్రక్రియను సూచించే ప్రతికూల పదం కానే కాదని అర్థమయ్యింది.  

Next: ముస్లిం సమాజ నియామక లక్ష్యం?

Comments

Advertisement